Flag Counter

Monday, December 28, 2015

THIRUPPAVAI PASURAMULU IN TELUGU


తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు
ఆండాళ్ తిరువడిగలేశరణం
పాశురము
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాళ్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి "సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.
కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.
"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం.
"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టించు కోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
వెళ్ళియెళు న్దువియాళముఱజ్గిత్తు,
పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.
భావం : కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.
అవతారిక :-
ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేల్కొలిపారు. ఇక ఎనిమిదవ గోపికను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కల్గినది. తన నేత్ర సౌందర్యాన్ననుభవించటానికై శ్రీ కృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో వుండి ఉదాసీన వైఖరిననుసరిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న యీమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారు. క్రిందటి (మాలికలో) ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కాని ఊరివారు వ్రేపల్లెలో కృష్ణ కీర్తనమేగాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికిని యిక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించివున్న శ్రీమన్నారాయణుడు అవసరార్ధము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు. నామ రూపాలు వేరైనా తత్త్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు.
(చారకేశి రాగము - ఆదితాళము)
ప.. లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!
లేవే! తామరసాక్షి! లే! మా కాశ్చర్యమాయె!
అ..ప.. లేవే! పడకను వీడవె! రావె! తీర్థమాడగ
వేవేగ లేచిరావె! సమయము మించి పోవునె!
చ.. నోటిని జీలిచి బకాసురు జంపిన 
పటు బలశాలి శ్రీకృష్ణుని కీర్తిని
నోట బాడుచు నోము నోచేటి కన్యలు - ఆ
చోటు చేరిరె! వేగ నిద్దుర లేవనె!
చ.. శుక్రుండుదయ మందె నస్తమించెను గురుడు
పక్షుల కలవరము లవిగో వినబడవొ నీకు?
శ్రీకృష్ణుని తలచు కపటమ్ము వీడి యిపుడు
ఆ కృష్ణ విరహ తాపము దీర నీరాడ
లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!

No comments:

Post a Comment